Saturday, September 28, 2019

ఇకపై అమెరికాలోనూ జేఈఈ ప్రవేశ పరీక్షలు అక్కడి విద్యార్థులను ఆకర్షించేందుకే

దిల్లీ: ఐఐటీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షల విషయంలో కీలక అడుగు పడింది. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇక అమెరికాలోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. మనదేశంలో ఉన్న ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లోకి అమెరికా నుంచి భారత్‌కు  విద్యార్థులను రప్పించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షల్లో అడిస్‌ అబాబా(ఇథియోపియా), కొలంబో(శ్రీలంక), ఢాకా(బంగ్లాదేశ్‌), దుబాయ్‌(యూఏఈ), ఖాట్మండు(నేపాల్‌), సింగపూర్‌ వంటి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు అమెరికాలో ప్రవేశ పరీక్ష నిర్వహించింది లేదు. దీనిపై ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘అమెరికా-భారత్‌కు టెక్నాలజీ పరంగా ఎంతో అనుబంధం ఉంది. అక్కడ కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఎన్నో అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే 2020లో జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలను శాన్‌ ఫ్రాన్సిస్కోలో కూడా నిర్వహించనున్నాం. ఈ పరీక్ష మేనెలలో జరిగే అవకాశం ఉంటుంది.’ అని తెలిపారు. ఇదే విషయాన్ని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ రామ్‌గోపాల రావు ముందు ప్రస్తావించగా... ‘శాన్‌ ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతంలో భారతీయులు ఎక్కువమంది ఉన్నారు. భారతీయ విద్యాసంస్థలకు చెందిన కొందరు ఫ్రొఫెసర్లు అక్కడ పర్యటించినప్పుడు..పూర్వ విద్యార్థి ఒకరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తమ పిల్లల్ని ఇండియన్‌ ఐటీ చదివించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాబట్టే శాన్‌ఫ్రాన్సిస్కోను కూడా ఈ సారి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. వీరిని చూసి అమెరికా విద్యార్థులు కూడా ఇక్కడి విద్యాసంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది’ అని గోపాల రావు తెలిపారు.

No comments:

Post a Comment